“ఎవరైనా ఒక ముస్లిం యొక్క సంపదను లేదా ఆస్తిని మోసపూరితంగా ఆక్రమించుకునే ఉద్దేశ్యముతో (అబద్ధపు) ప్రమాణం…

“ఎవరైనా ఒక ముస్లిం యొక్క సంపదను లేదా ఆస్తిని మోసపూరితంగా ఆక్రమించుకునే ఉద్దేశ్యముతో (అబద్ధపు) ప్రమాణం చేస్తాడో, (తీర్పు దినమున) అతనిపై అల్లాహ్ ఆగ్రహంతో ఉన్న స్థితిలో అతడు అల్లాహ్’ను కలుస్తాడు

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “ఎవరైనా ఒక ముస్లిం యొక్క సంపదను లేదా ఆస్తిని మోసపూరితంగా ఆక్రమించుకునే ఉద్దేశ్యముతో (అబద్ధపు) ప్రమాణం చేస్తాడో, (తీర్పు దినమున) అతనిపై అల్లాహ్ ఆగ్రహంతో ఉన్న స్థితిలో అతడు అల్లాహ్’ను కలుస్తాడు.” అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ రదిఅల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “అల్-అష్’అథ్ ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా, ఇది నా గురించే. నాకు ఒక యూదుడితో ఉమ్మడి భూమి ఉంది, ఆ యూదుడు తరువాత నా యాజమాన్యాన్ని నిరాకరించాడు; అప్పుడు నేను రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అతనిమీద ఫిర్యాదు చేసినాను. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీదగ్గర అందుకు రుజువులు ఏవైనా ఉన్నాయా?” అని అడిగారు. నేను “లేవు” అన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వస యూదునితో “నీవు ప్రమాణం చేయి” అన్నారు. అందుకు నేను: “ఓ రసూలుల్లాహ్! అతడు ప్రమాణం చేసి నా సంపదను కబ్జా చేసుకుంటాడు (అధీన పరుచుకుంటాడు) అన్నాను. అపుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేసినాడు: {ఇన్నల్లజీన యష్తరూన బి అహ్’దిల్లాహి, వ ఐమానిహిం థమనన్ ఖలీలా.... } ఆయతు చివరి వరకు; [నిశ్చయంగా, ఎవరైతే తాము అల్లాహ్ తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్పలాభాలకు అమ్ముకుంటారో…..] (సూరహ్ ఆలి ఇమ్రాన్ 3:77)

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో మరొకరి ఆస్తిని అన్యాయంగా పొందడానికి తను చేస్తున్న ప్రమాణంలో తాను అబద్ధం చెబుతున్నాడని తెలిసి కూడా అల్లాహ్ పై ప్రమాణం చేయవద్దని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు. అలాంటి వ్యక్తి తీర్పుదినము నాడు అల్లాహ్ అతనిపై ఆగ్రహంగా ఉన్నస్థితిలో ఆయనను కలుస్తాడు. అల్-అష'త్ ఇబ్న్ కైస్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేసినారు: తనకు (అంటే అల్-అష'త్ కు) మరియు ఒక యూదు వ్యక్తి మధ్య ఒక భూమి యొక్క యాజమాన్యం విషయంలో తగాదా తలెత్తినపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు పలికినారు. వారిద్దరూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు మధ్యవర్తిత్వం కొరకు వచ్చినారు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్-అష్' అస్ రదిఅల్లాహు అన్హు తో ఇలా అన్నారు: “నీ వాదనకు మద్దతుగా, భూమి యొక్క యాజమాన్యం నీదే అనడానికి నీవు ఆధారాలు అందించాలి. నీవు అలా చేయలేక పోతే, నీవు ఏ వ్యక్తి పైనైతే నింద మోపుతున్నావో ఆ వ్యక్తి చేత భూమి తనదే అని ప్రమాణం చేయించడం తప్ప మరో మార్గం లేదు”. దానికి అల్ అష్’అస్ రదిఅల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! అప్పుడు ఆ యూదుడు ఎటువంటి సంకోచం లేకుండా ప్రమాణం చేసి నా సంపదను స్వాధీనం చేసుకుంటాడు.” అప్పుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దీనిని నిర్ధారిస్తూ ఖుర్’ఆన్ లో ఈ ఆయతును అవతరింపజేసినాడు. అల్లాహ్ ఇలా అన్నాడు: “నిశ్చయంగా, ఎవరైతే తాము అల్లాహ్ తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్పలాభాలకు అమ్ముకుంటారో (లేదా వాటిని మార్చేస్తారో), (ఇక్కడ అల్లాహ్ మోమినులకు తమ ప్రమాణాలను, ఒప్పందాలను నెరవేర్చమని హితబోధ చేస్తున్నాడు) (ఎవరైతే స్వల్పలాభాలకు అమ్ముకుంటారో, లేక మార్చివేస్తారో, మరియు పెంటకుప్ప లాంటి ప్రపంచపు స్వల్పలాభాలకు అల్లాహ్ పేరున అబధ్ధపు ప్రమాణాలు చేస్తారో) అలాంటి వారికి పరలోక జీవితంలో ఎలాంటి భాగం ఉండదు (మరియు ఎటువంటి వాటా ఉండదు) మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ వారితో (వారిని సంతోషపరిచే, లేక వారికి ప్రయోజనం చేకూర్చే ఒక్క మాట కూడా) మాట్లాడడు (పైగా వారి పట్ల ఆగ్రహంతో ఉంటాడు) మరియు వారివైపు (దయతో కూడిన మరియు కరుణాపూరితమైన ఒక్క చూపు) కూడా చూడడు మరియు వారిని పరిశుద్ధులుగాచేయడు (వారిని పరిశుద్ధులుగా చేయుటకు ఒక్క మంచి మాట కూడా పలుకడు, వారిని పాపములనుండి, మాలిన్యములనుండి పరిశుద్ధులను చేయుటకు క్షమాభిక్ష కూడా ప్రసాదించడు) మరియు వారికి (వారు చేసిన దానికి గానూ అత్యంత దుఃఖకరమైన శిక్ష) బాధాకరమైన శిక్ష ఉంటుంది.

فوائد الحديث

ప్రజల సంపదలను అన్యాయంగా, అధర్మంగా సొంతం చేసుకోవడం నిషేధము.

అది చిన్నది గానీ లేదా పెద్ది గానీ, ఏ విషయాలలోనైనా ముస్లింల హక్కులను కాజేయడం కఠినంగా నిషేధించడం జరిగింది.

రుజువులను, సాక్ష్యాలను పొందుపరిచే భారం వాదిపైనే ఉంటుంది మరియు ప్రతివాది దానిని తిరస్కరిస్తే అతడు ప్రమాణం చేయాలి.

వ్యాజ్యాలలో హక్కు ఇద్దరు సాక్షుల ద్వారా సాక్ష్యము ద్వారా స్థాపించబడుతుంది. వాది వద్ద ఆధారాలు లేకపోతే, ప్రతివాది ప్రమాణం చేయాలి.

"అల్ ఘమూస్" అనేది ఒక రకమైన ప్రమాణము. ఇది మరొకరి హక్కును లాక్కోవడానికి తీసుకునే తప్పుడు ప్రమాణం. ఇది నిషేధము. ఇది అల్లాహ్ కోపానికి మరియు శిక్షకు గురయ్యేలా చేసే ప్రధాన పాపాలలో (కబాయిర్’లలో) ఒకటి.

ముఖ్యంగా ప్రమాణం చేయబోతున్నప్పుడు, వాద, ప్రతివాదులకు న్యాయం చేసే వ్యక్తి (న్యాయాధీశుడు, మధ్యవర్తి) హెచ్చరిక చేయవచ్చును.

التصنيفات

ప్రమాణాలు మరియు మొక్కుబడులు, దావాలు మరియు ఆధారాలు