.

అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: అలీ ఇబ్నె అబూ తాలిబ్ (రదియల్లాహు అన్హు) యెమెన్ నుండి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కొంత బంగారం పంపారు. ఆ బంగారానికి ఇంకా కొంత మట్టి అంటుకుని ఉండగా, పచ్చటి వస్త్రంలో పెట్టి పంపించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ బంగారాన్ని ఈ నలుగురికి పంచిపెట్టారు: 'ఉయైనహ్ బిన్ బద్ర్, అఖ్రఅ్ బిన్ హాబిస్, జైద్ అల్ ఖైల్, మరియు నాలుగో వ్యక్తి అల్‌ఖమా లేదా ఆమిర్ బిన్ తుఫైల్ (ఇద్దరిలో ఒకరు). అప్పుడు సహాబాలలో ఒకరు: "మేము వీళ్లకంటే దీనికి ఎక్కువ హక్కుదారులం" అని అన్నారు. ఇది ప్రవక్తకు తెలిసింది. దానిపై ఆయన ఇలా అన్నారు: "మీరు నన్ను నమ్మడం లేదా? నేను ఆకాశాల్లో ఉన్న అల్లాహ్‌కు విశ్వసనీయుడిని. ఉదయం, సాయంత్రం నా వద్దకు పరలోక వార్తలు వస్తుంటాయి." అప్పుడు ఒక వ్యక్తి (కళ్లలో లోతు, బుగ్గలు ముదురు, నుదురు పైగా, గడ్డం మందంగా, తల శుభ్రంగా గీయించుకున్నవాడు, కడుపుపై మడత పెట్టుకున్న దుస్తులు ధరించినవాడు) లేచి: "ఓ రసూలల్లాహ్! అల్లాహ్‌ కు భయపడండి" అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహ వసల్లం: "నీకు శాపం! భూమిపై ఉన్న వారందరి కంటే ఎక్కువగా అల్లాహ్‌ కు భయపడటానికి నేను అర్హుడిని కాదా?" అని అన్నారు. ఆ తరువాత ఆ వ్యక్తి వెళ్లి పోయాడు. అపుడు ఖాలిద్ ఇబ్న్ వలీద్: "ఓ రసూలిల్లాహ్! నేను ఇతని మెడ నరికి వేయనా?" అని అడిగారు. దానికి ఆయన: "లేదు, ఎందుకంటే ఇతను నమాజ్ చేయువారిలోని వాడు" అని చెప్పారు. అపుడు ఖాలిద్: "ఎంతో మంది నమాజ్ చేస్తారు, కానీ వారి మనసులో లేనిది నోటితో చెబుతారు" అని అన్నారు. దానికి ప్రవక్త : "నేను ప్రజల హృదయాలను చీల్చి చూడమని, వారి పొట్టలను తెరచి చూడమని ఆదేశించబడలేదు" అన్నారు. ఆ వ్యక్తి వెళ్లిపోతుండగా ప్రవక్త: "ఈ వ్యక్తి సంతానంలోంచి ఒక వర్గం పుట్టుకు వస్తారు. వారు అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్) మధురమైన స్వరంతో పారాయణం చేస్తారు, కానీ అది వారి గొంతును దాటి లోపలికి పోదు. వారు బాణం లక్ష్యాన్ని ఛేదించినంత వేగంగా ధర్మాన్ని విడిచి పెట్టి వెళ్తారు. ఒకవేళ నేను వారిని చూడగలిగితే, థమూద్ ప్రజలు నాశనమైనట్లుగా, వారినీ అలా నాశనం చేస్తాను" అని అన్నారు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

అలీ బిన్ అబూ తాలిబ్ రదియల్లాహు అన్హు యెమెన్ నుండి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఒక బంగారం ముక్కను పంపించారు. ఆ బంగారం ముక్కను చర్మంతో తయారుచేసిన సంచిలో పెట్టి పంపించారు. ఆ బంగారం ముక్కను ఇంకా మట్టి అంటుకునే ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (ఆ బంగారాన్ని) అక్కడున్న నలుగురు వ్యక్తులకు పంచిపెట్టారు. ఆ నలుగురు - ఉయైనహ్ బిన్ బద్ర్ అల్ ఫజారీ, అఖ్రఅ్ బిన్ హాబిస్ అల్ హన్జలీ, జైద్ అల్ ఖైల్ అల్ నబ్హానీ, మరియు అల్కమా బిన్ ఉలాథా అల్ ఆమిరీ. అది చూసి ఆయన సహాబాలలోని ఒకరు ఇలా అన్నారు: "వీళ్ళకంటే మేమే దీనికి ఎక్కువ హక్కుదారులం."హదీసు రావీ అంటున్నారు: ఆ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సల్లల్లాహు అలైహి వసల్లంకు చేరితే ఆయన ఇలా పలికినారు: "నీవు నన్ను నమ్మడం లేదా? నేను ఆకాశంలో ఉన్నవాని (అల్లాహ్) విశ్వసనీయుడిని. నాకు పరలోక సమాచారం ఉదయం, సాయంత్రం వస్తూ ఉంటుంది." అప్పుడు ఆ వ్యక్తి లేచాడు — అతడి కళ్లు లోతుగా, బుగ్గలు బయటకు ఉబ్బి, నుదురు కొంచెం పైకి ఉండి, గడ్డం మందంగా (కానీ పొడవుగా కాదు) ఉంది, తలను పూర్తిగా గొరిగించుకుని ఉన్నాడు, తన కింద భాగాన్ని కప్పే వస్త్రాన్ని పైకి ఎత్తుకుని ఉన్నాడు — అతను ఇలా అన్నాడు: "ఓ రసూలుల్లాహ్! అల్లాహ్‌ కు భయపడండి." దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: "నీకు శాపం! భూమిపై ఉన్న వారందరిలో అల్లాహ్‌ కు భయపడటానికి నేను ఎక్కువ అర్హుడిని కాదా?" ఆ తరువాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అప్పుడు ఖాలిద్ ఇబ్న్ వలీద్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు:" "ఓ రసూలుల్లాహ్! నేను అతడి మెడ నరికి వేయనా?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: 'లేదు, అతను నమాజ్ చేసే వాడై ఉండవచ్చు' అని పలికినారు. అప్పుడు ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు, "ఎంతో మంది నమాజ్ చేసేవారిలో వారి నోటితో చెప్పేది వారి హృదయంలో ఉండదు" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ప్రజల హృదయాలను తవ్వి చూడమని, లేదా వారి పొట్టలను చీల్చి చూడమని నేను ఆదేశించబడలేదు; బహిరంగ విషయాల ప్రకారం మాత్రమే తీర్పు చెప్పమని నేను ఆదేశించబడినాను." "ఆ వ్యక్తి వెనక్కు తిరిగి వెళ్తుండగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని చూసి ఇలా పలికినారు: "ఈ వ్యక్తి సంతానంలో నుండో లేదా అతని సహచరుల సంతానంలో నుండో లేదా అతని తెగ సంతానంలో నుండో ఒక వర్గం పుట్టి, బయలుదేరుతుంది. ఆ వర్గం వారు అల్లాహ్ యొక్క గ్రంథాన్ని (ఖుర్ఆన్‌ను) చాలా చక్కటి స్వరంతో మృదుమధురంగా పఠించడంలో నిపుణులు. వారి నోళ్లు ఖుర్ఆన్ పారాయణం వల్ల తడిగా ఉంటాయి. కానీ ఖుర్ఆన్ వారి గొంతును దాటి వారి హృదయాలకు చేరదు, అంటే వారు పఠించిన ఖుర్ఆన్ వారి మనసులను మార్చదు, అల్లాహ్ వారిని (శుభాలలో) పైకి ఎత్తడు, వారిని అంగీకరించడు. బాణం ఎక్కు పెట్టిన తరువాత అది తన లక్ష్యాన్ని ఛేదించడానికి వెంటనే ఎంత వేగంగా బయటకు వెళ్తుందో, వారు అంత వేగంగా, సులభంగా ఇస్లాం నుండి బయటకు వెళ్లిపోతారు." ఆ తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా కూడా అన్నారని నేను అనుకుంటున్నాను: 'వారు (ఆ వర్గం) ముస్లింలపై ఖడ్గంతో (యుద్ధంతో) తిరుగుబాటు చేసినపుడు, థమూద్ ప్రజలను ఎలా నాశనం చేయబడినారో, వారు కూడా అలా తీవ్రంగా సంహరింప బడాలని నేను ఆశిస్తున్నాను.'"

فوائد الحديث

సహనశీలత (హిల్మ్) మరియు బాధను తట్టుకునే సహనశక్తి (సబ్ర్) ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో కనబడే అత్యంత గొప్ప గుణాలు.

ఈ హదీథులోని సంఘటన ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత్వం గురించి మరియు ఆయనపై వహీ (దివ్యవాణి) అవతరిస్తుందనే విషయం గురించి స్పష్టంగా ఋజువు అవుతున్నది:

ప్రజల విషయంలో వారి బహిరంగ ప్రవర్తన ఆధారంగానే తీర్పు చెప్పాలి, అయితే వారి అంతర్గత విషయాలు అల్లాహ్‌కే అప్పగించాలి.

నమాజ్ (సలాహ్) యొక్క గొప్పతనం మరియు నమాజ్ చేసే వారిని ఇస్లామీయ హద్ శిక్ష వలన తప్ప చంపకూడదని ఈ హదీథు తెలుపుతున్నది.

ఖవారిజ్ యొక్క ప్రమాదం మరియు వారు యుద్ధానికి దిగితే వారిని ఎదుర్కోవాల్సిన అవసరం గురించి ఈ హదీథు తెలుపుతున్నది.

ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ వ్యాఖ్య: ఖవారిజ్‌తో యుద్ధం చేయమనే ప్రోత్సాహం మరియు అలీ రదియల్లాహు అన్హు ఖవారిజ్‌పై యుద్ధం చేయడంలో ఉన్న గొప్ప ప్రాధాన్యత ఈ హదీథు ద్వారా తెలుస్తున్నది.

ఖుర్ఆన్‌ పై దీర్ఘాలోచన చేస్తూ పఠించడం, దానిని అర్థం చేసుకోవడం, ఆచరణలో పెట్టడం, దానిని గట్టిగా పట్టుకుని ఉండడం యొక్క ప్రాముఖ్యత ఈ హదీథు ద్వారా తెలుస్తున్నది.

التصنيفات

ఆరంభాలు పాతవిగా ఉన్న వర్గాలు మరియు మతాలు